Tuesday, 19 June 2018

తాత కథలు

ఒక గ్రామం లో ఒక తాత,మనుమడు వుండే వారు. మనుమడు ఏదో కొంత కవిత్వం
రాస్తూవుండే వాడు. తాత మనుమడిని నామీద కూడా కవిత రాయరా అని అడిగాడు.
అప్పుడు ఆ చిలిపి మనుమడు ఇలా రాశాడు.
భళి భళీ మా తాత బల్లెంబు చేబూని పుల్లాకు (ఎంగిలి విస్తరాకు) తూటుగా పొడిచినాడు
ఎద్దుచ్చ బోయంగ ఏరులై పారంగ లంకించి లంకించి దాటినాడు
నాగులాపురము కాడ నక్క తరుముకు రాగ తిరువళ్ళూరు దాక పరుగు తీసినాడు
కర్ర చేత బట్టి యెదర ఎవ్వరు లేక చెట్టుతో సాము గరిడీ చేసినాడు కర్రిరిగి పోవంగ
కిందబడి ఎక్కెక్కి ఏడ్చినాడు. భళి భళీ మాతాత వీరత్వ మేరీతి పొగడ గలను.
ఈ కైత చదివి యిరిగిన కర్రతో మా తాత నన్ను బాగ ఉతికినాడు.

Sunday, 15 November 2015

సంస్కృత శ్లోకములు - ప్రహేళికలు

ప్రాతర్ద్యూత ప్రసంగేన 
మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః
రాత్రౌ చోర ప్రసంగేన 
కాలో గచ్ఛతి ధీమతామ్ ॥

Friday, 30 October 2015

రాఘవయాదవీయము


రాఘవయాదవీయము:


కాంచీపురం వద్దనున్న అరసనిపాలైలో జన్మమంది 40 శ్లోకములలో అనులోమములో రామగాథ, విలోమములో కృష్ణలీలలు వచ్చేవిధముగా రాసినారు వేంకటాధ్వరి కవివరేణ్యులు.
దానికి నా తెలుగు అనువాదము క్రింద రాసినాను. విజ్ఞులు తప్పులుంటే సరిదిద్దగలరని మనవి.


శ్లోకము ౧:

అనులోమము
వందేహం దేవం తం శ్రీతం రంతారం కాలం భాసా యః
రామః రామాధీః ఆప్యాగః లీలం ఆరాయోధ్యే వాసే

తాత్పర్యము: పరమాత్ముడైన శ్రీరామచంద్రునికి, సీతాదేవి మీద మనసుతో పర్వతములు తిరిగివచ్చి తన భవనమందు ఆ దేవితో లీలగా, శోభనముగా కాలము గడుపుతున్నవానికి, నేను నమస్కరించుచున్నాను.

శ్లోకము ౧

విలోమము
సేవాధ్యేయో రామాలాలీ గోప్యారాధీ మరామోరాః
యస్సాభాలంకారం తారం తం శ్రీతం వందేహం దేవం

తాత్పర్యము: సేవచేతమాత్రమే (నవవిధసేవలు) తెలుసుకోగలిగినట్టివాడు, తన భార్యలతో లీలగా విహరించువాడు, గోపికలచే ఆరాధింపబడువాడు, మ(లక్ష్మీదేవి)ని ఉరముపై గలవాడు (లక్ష్మ్యాధిష్టితవక్షుడు), అలంకారములచే భాసించువాడు, ఏ దేవుడైతే లక్ష్మీదేవితో విహరించుచున్నాడో, అట్టివానికి నేను ధీటుగా నమస్కరించుచున్నాను.

శ్లోకం- ౨.

అనులోమము
సాకేతాఖ్యా జ్యాయామాసీత్ యా విప్రాదీప్తా ఆర్యాధారా |
పూః ఆజీత అదేవాద్యావిశ్వాసా అగ్ర్యా సావాశారావా ||
ప్రతిపదార్థము:
సాకేతాఖ్యా- సాకేతము అనెడి పేరంబరగెడు
జ్యాయాం - జ్యా=విల్లు మోపునటువంటి ప్రదేశము అనగా భూమి.
యా - ఏది
విప్రాదీప్తా - ఆదీప్తా విప్రా సా = విప్రుల సమూహముచేత భాసించునట్టిది
ఆర్యాధారా - ఆర్యులకు (వైశ్యులకు తద్వారా వారి వర్తకమునకు) ఆధారభూతమైనది.
పూః - నగరము
ఆజీత - అజస్య అపత్యం పుమాన్ - ఎవరైతే అజుడు అనువానిని అనపత్యుడు కావింపకుండెనో = అనగా అజుని కుమారుడు దశరథుడు.
అదేవాద్యావిశ్వాసా - అ-దేవాత్-అవిశ్వాసా = దేవతలయందు అవిశ్వాసము లేనివారు అనగా సదా దేవతలను హవిస్సులతో ఆరాధించువారు కలిగినట్టి నగరము.
అగ్ర్యా - అగ్రగణ్యమైనది
సావాశారావా - సావాశా=సవనమునందు ఆసక్తి కలవారు; ఆరావా - అట్టివారు చేయు శబ్దములతో నిండిఉన్నది.
ఆసీత్ - ఉండెను

తాత్పర్యము: పూర్వము సాకేతము అనబడు నామముగల ఒక నగరము విద్యావంతులైన బ్రాహ్మణులతో నిండి, వైశ్యుల వర్తకమునకు ఆధారభూతమై, అజ మహారాజు కుమారుడైన దశరథునికి రాజధానియై, సదా దేవతలయందు విశ్వాసపరులైన వారిచే యజ్ఞయాగాది క్రతువులు చేయబడగా ఆ హవిస్సును స్వీకరించుటకు వచ్చిన దేవతల సందడితో నిండి ఉన్న, నగరములలో ప్రథమమైనదిగా ఉండెడిది.

పై శ్లోకమునకు విలోమము (వెనుకకు రాయబడినది)
వారాశావాసాగ్ర్యా సాశ్వావిద్యావాదేతాజీరా పూః
రాధార్యాప్తా దీప్రా విద్యాసీమా యా జ్యాఖ్యాతా కే సా

ప్రతిపదార్థము:
వారాశావాసాగ్ర్యా- వారాశౌ = వారాశి (సముద్రము) మధ్యమందు ఉన్ననగరములలో; ఆగ్ర్యా - అగ్రగణ్యమైనది.
సాశ్వా - గుఱ్ఱములతో కూడినట్టిది.
విద్యావాదేతాజీరా - విద్యా-వాద-ఇతాజీ-ఈరా = నిరంతరమూ విద్యా వాదములయందు పరస్పర జయాభిలాష గల్గిన పండితులతో కూడినట్టిది.
పూః - నగరము
రాధార్యాప్తా - రాధార్య+ఆప్త = రాధ చేత ఆరాధింపబడువాడిని పొందినట్టిది.
దీప్రా - దీపించుచున్నట్టిది.
విద్యాసీమా - సమస్త విద్యలకూ సీమ (అనగా పొలిమేర) గా భాసిల్లునట్టిది.
యా - ఏ నగరమైతే
సా - కలదో ఆ నగరము అనగా ద్వారకాపురి
జ్యా - భూమియందు
ఖ్యాతా - ఖ్యాతినొందినట్టిది
కే - సముద్రమునందు కలదు.
తాత్పర్యము: వేలానగరములలో ప్రశస్తమై, అశ్వములతోకూడినది, వేదపండితుల వాదానువాదములకు క్షేత్రమైనట్టిది, రాధకు ఆప్తుడైన శ్రీకృష్ణునికి నెలవైనట్టిది, నీటికిఒడ్డువలే, విద్యలకు ఒడ్డైనటువంటి బ్రహ్మవిద్యకు ఆలవాలమైనట్టిది అయి ద్వారకానగరము ఉండెడిది.

శ్లోకము - ౩

అనులోమము:
కామాభారస్థలసారశ్రీసౌధా అసౌ ఘన్వాపికా
సారసారవపీనా సరాగాకారసుభూరిభూః

ప్రతిపదార్థము:
కామభారస్థల - కాముడు అనగా మన్మధునిచే కలగచేసినయట్టి తేజస్సు కలిగినట్టి స్థలము. అనగా అనంగక్రీడలకు ఆసక్తి కలిగినట్టి రసికులతో కూడినట్టి నగరము.
సారశ్రీ - మానవ జీవితములోని సమస్త సంపదలకూ సారమైన సంపాదకు ఆలవాలమైనట్టిది (పరమాత్ముడైన శ్రీరాముడిని కలిగి ఉన్నట్టిది).
అసౌ - ఈ
సౌధా - అయోధ్య అనెడి మహా సౌధము (సౌధము అనగా సున్నముతో కట్టబడినట్టి కట్టడము అని అర్థము).
ఘన్వాపికా - ఘనమైన (లోతైన) బావులు కలిగినట్టిది. నీటికి ఎన్నడూ కొఱత లేక పాడిపంటలతో సమృద్ధిగా ఉన్నట్టిది.
సారసారవపీనా - సారస+ఆరవ+పీనా = ఉత్తుంగమైన స్వరములు కలిగిన సారస పక్షుల కలకలారావములతో నిండినటువంటిది.
సరాగాకారసుభూరిభూః - సరాగా+ఆకార+సుభూరి+భూః = సరాగా - ఎరుపు వర్ణముకలిగిన సారవంతమైన పొలములు గలిగిన భూమి గలది.
తాత్పర్యము: అయోధ్య అనెడి నగరము మదనక్రీడలపట్ల ఆసక్తి కలిగినట్టి రసికులతో కూడినట్టిదై, మానవ జీవితములోని సమస్త సంపదలకూ సారమైన సంపాదకు ఆలవాలమైనట్టిదై (పరమాత్ముడైన శ్రీరాముడిని కలిగి ఉన్నట్టిదై), లోతైన బావులు కలిగి నీటికి ఎన్నడూ కొఱత లేక పాడిపంటలతో అలరారుతున్నట్టిదై, ఉత్తుంగమైన స్వరములు కలిగిన సారస పక్షుల కలకలారావములతో నిండినటువంటిదై, ఎరుపు వర్ణముకలిగిన సారవంతమైన పొలములు గలిగిన భూమి గలదై ఉండెను.

పై శ్లోకమునకు విలోమము (వెనుకకు రాయబడినది)
భూరిభూసురకాగారాసనా పీవరసారసా
కా ఆపి వా అనఘసౌధ అసౌ శ్రీరసాలస్థభామకా

ప్రతిపదార్థము:
భూరిభూసురకాగారాసనా - భూరి+భూసురక+ఆగార+ఆసనా = వైదికకర్మలను ఆచరించుటకు వీలుగా బ్రాహ్మణులకు అనువైన ఉన్నతమైన ఆసనములు కలది.
పీవరసారసా - పీవర+సారసా = పెద్దని తామరపువ్వులు కలిగినది. (పెద్దని సరస్సులు కలిగి అందులో దొడ్డ తామరపూవులతో నొప్పునటువంటిది)
అనఘసౌధ - అనఘ+సౌధ = అఘరహితమైన (అనఘ అనగా దోషములేని) భవంతులు కలిగినటువంటిది.
శ్రీరసాలస్థభామకా - శ్రీరసాల (మామిడి) +స్థ (చెట్లు) +భామాకా (సూర్యుడు) = సూర్యున్ని మోయుచుండెనా అను అనుమానము కలిగించునట్టి మామిడిపండ్లు కలిగిన ఉన్నతమైన చెట్లు కలిగినటువంటిది.
కా ఆపి వా - ఒకానొక నగరము కూడా
అసౌ - ఉండెను.

తాత్పర్యము: వైదికకర్మలను ఆచరించుటకు వీలుగా బ్రాహ్మణులకు అనువైన ఉన్నతమైన ఆసనములు కలదై, పెద్దని సరస్సులు కలిగి అందులో దొడ్డ తామరపూవులతో నొప్పునటువంటిదై, దోషరహితమైన భవంతులు కలిగినట్టిదై, సూర్యున్ని భ్రమింపచేయు పెద్దని మామిడిపండ్లు కలిగిన ఉన్నతమైన వృక్షములు కలిగినది ద్వారకాపురి అను నగరము ఒకటి భూమండలమున ఒప్పుచుండెను.

శ్లోకము – ౪

అనులోమము:
రామధామ సమానేనమాగోరోధనం ఆస తామ్
నామహాం అక్షరరసం తారభాః తు న వేద యా

ప్రతిపదార్థము:
రామధామ – భగవంతుడైన శ్రీరామచంద్రునియొక్క దివ్య తేజస్సు చేత ప్రజ్వలితమై
సమానేనం – ఆ తేజస్సు నిజవంశమూలపురుషుడైన సూర్యభగవానుని తేజస్సును పోలి యుండుట చేత
ఆగోరోధనం – ఆగో+రోధనం = గో అనగా కాంతి, కిరణములు అనే అర్థము వలన కాంతివరకు సమస్తమునూ నిరోధించబడినట్టిది. (శ్రీరామచంద్రుని కాంతి విశేషము తద్వంశపతియగు సూర్యుని కాంతిని కూడా కమ్మివేసినట్టిదై ఉన్నట్టి నగరము అని)
తు న వేద తారభాః–ఆ నగరము ఎన్నడునూ నక్షత్రములయొక్క కాంతిని ఎఱిగి ఉండలేదు
తు నామహాం – కానీ ఎన్నడూ పండుగ వాతావరణము కనపడక కూడా లేదు.
అక్షరరసం – అక్షరామైన (నిరంతరమైన) సంతోషమును కలిగి
ఆస తామ్ – కలిగి ఉండెను అయోధ్యా నగరము.
తాత్పర్యము: సాక్షాఛ్చ్రీమన్నారాయణుడైన శ్రీరామచంద్రమూర్తి కలిగి ఉన్న ఆ అయోధ్యా నగరము నిరంతరమూ ఆయన సూర్యసమాన దీప్తి ప్రజ్వలితమై, సూర్యభగవానుని కిరణములను, తారాకాంతిని కూడా అడ్డుకున్నట్టి మహాసౌధములు కలిగి ఉన్ననూ, ఏనాడూ పండుగ వాతావరణమును కోల్పోవక, నిరంతరానంద నిమగ్నయై ఉండెను.

పై శ్లోకమునకు విలోమము (వెనుకకు రాయబడినది)
యాదవేనః తు భారాతా సంరరక్ష మహామనాః
తాం సః మానధరః గోమాన్ అనేమాసమఘామారాః

ప్రతిపదార్థము:
యాదవేనః – యదువంశశ్రేష్టులలో ప్రథముడూ, యదువంశమునందు సూర్యునివలె ఉద్భవించినవాడు,
భారాతా – భ+రాతా = ఎవడైతే కాంతిని ప్రసరింపజేయుచున్నాడో అతడు,
మహామనాః – గొప్ప మనస్సు గలవారు,
మానధరః – అభిమానమునే వస్త్రముగా ధరించినవారు, మాన్యులు,
గోమాన్ – గోపాలకులు,
అనేమాసమఘామారాః – అ+నేమ+ఆసమ+ధామ+రాః – తిరుగులేని, సాటిరాని శౌర్యపరాక్రమములు కలిగి తత్సమాన ధనము గలిగినవారు
తాం – పైవారు ఉన్నట్టి ఆ నగరమును (ద్వారకను)
సః = అతడు – అనగా శ్రీకృష్ణుడు
సంరరక్ష – బాగుగా సంరక్షించెను

తాత్పర్యము: గొప్ప మనస్సు గలవారున్నది, అభిమానమునే వస్త్రముగా ధరించినవారు, మాన్యులు కలది, తిరుగులేని, సాటిరాని శౌర్యపరాక్రమములు కలిగి తత్సమాన ధనము గలిగినవారున్నది, గోపాలకులు కలది అయిన ఆ ద్వారకాపురిని, యదువంశశ్రేష్టులలో ప్రథముడూ, యదువంశమునందు సూర్యునివలె ఉద్భవించినవాడు, తేజోస్వరూపుడు, అయిన శ్రీకృష్ణుడు బాగుగా సంరక్షించెను.


శ్లోకము –౫

అనులోమము:
యన్గాధేయః యోగీ రాగీ వైతానే సౌమ్యే సౌఖ్యే౭సౌ
తం ఖ్యాతం శీతం స్ఫీతం భీమాన్నామాశ్రీహాతాత్రాతమ్

ప్రతిపదార్థము:
గాధేయః - గాధి వంశోద్భవుడైన విశ్వామిత్రమహర్షి,
యోగీ - యోగిపుంగవుడునూ,
సౌమ్యే వైతానే సౌఖ్యే రాగీ  - వితానము అనగా శుభములు చేకూర్చునట్టి యజ్ఞము సౌఖ్యముగా చేయుటయందు ఉత్సాహము కలవాడునూ.
భీమాన్ - భీతి చెందినవాడయ్యి, రాక్షసభీతిచేత
తమ్ - ఆ శ్రీరామచంద్రుడిని
ఖ్యాతం - మిగుల పేరెన్నికగన్నవాడిని
శీతం - శరత్కాలచంద్రికా తుల్య శీతల భాస్వత్స్వరూపుడిని
స్ఫీతం - గెలుపే తప్ప ఓటమిని ఎఱుగనట్టి విజయమూర్తిని
అశ్రీహాతా - అ+శ్రీ+హాతా = అశ్రీ - అనగా అమంగళకరమైనవాటిని పరిహరించువాడిని
త్రాతమ్ - సర్వలోకైకరక్షకుడిని
ఆమ యాన్ అసౌ - తన రక్షణకై పొందెను (దశరథుని అనుజ్ఞ వడసి రాముడు విశ్వామిత్రుని వెంబడిచుచూ యాగ సంరక్షణము చేసెను)

తాత్పర్యము: గాధి వంశోద్భవుడూ, యోగిపుంగవుడునూ అయిన విశ్వామిత్రమహర్షి, శుభములు చేకూర్చునట్టి యజ్ఞము సౌఖ్యముగా చేయుటకై, రాక్షసభీతిచేత కలతనొంది, మిగుల పేరెన్నికగన్నవాడూ, శరత్కాలచంద్రికా తుల్య శీతల భాస్వత్స్వరూపుడూ, గెలుపే తప్ప ఓటమిని ఎఱుగనట్టి విజయమూర్తి, అమంగళకరమైనవాటిని పరిహరించువాడూ, సర్వలోకైకరక్షకుడునూ అయిన శ్రీరామచంద్రమూర్తిని తన యాగ సంరక్షణకై పొంది గొనిపోయెను.

పై శ్లోకమునకు విలోమము (వెనుకకు రాయబడినది)
తం త్రాతా హా శ్రీమాన్నామాభీతం స్ఫీతం శీతం ఖ్యాతం
సౌఖ్యే సౌమ్యే౭సౌ నేతా వై గీరాగీ యః యోధే గాయన్

 ప్రతిపదార్థము:
యః – ఎవడైతే
అభీతం – భయములేనివాడునూ, భయములను పోగొట్టువాడునూ,
స్ఫీతం – అజేయుడునూ,
శీతం – చల్లనివాడునూ, సమీపించుటకు అతి అనుకూలుడునూ,
ఖ్యాతం – మిక్కిలి పేరెన్నికగలవాడునూ,
త్రాతా – రక్షించునట్టివాడు,
తమ్ – అతడిని
గీరాగీ వై – గాయకులలో ప్రముఖుడు,
శ్రీమాన్ – గౌరవనీయుడు
నేతా – గాయకులకు నేత అయిన నారద మహర్షి
యోధే – యుద్ధములోని సైనికులయొక్క
సౌఖ్యే, సౌమ్యే – సుఖ సౌఖ్యముల కొఱకై,
హా – హాహాకారములిడిచూ
గాయన్ – గుణగానము చేయుచూ
ఆమ – సమీపించెను.

తాత్పర్యము: ఎవడైతే భయములేనివాడో, మఱియు భయములను పోగొట్టువాడో, అజేయుడునూ, చల్లనివాడునూ, సమీపించుటకు అత్యనుకూలుడునూ, రక్షించునట్టివాడు, అని పేరెన్నికగలవాడో, అతడిని గాయకులలో ప్రముఖుడు, గౌరవనీయుడు, గాయకశిఖామణి అయిన నారద మహర్షి యుద్ధములోని సైనికులయొక్క సుఖ సౌఖ్యములు కోరినవాడై హాహాకారములిడిచూ శ్రీకృష్ణగుణగానము చేయుచూ ద్వారకాపురిలోని కృష్ణపరమాత్ముడిని సమీపించెను. (ఎందుకు నారద మహర్షి భయపడవలసి వచ్చినది అనునది తదుపరి కథాంశము)


శ్లోకము – ౬

అనులోమము:
మారమం సుకుమారాభం రసాజాప నృతాశ్రితం
కావిరామదలాప గోసమావామతరా నతే

ప్రతిపదార్థము:
మారమ – మా అనగా లక్ష్మిదేవికి భర్త అయినటువంటివాడు శ్రీమహావిష్ణువు
సుకుమారాభం – సుకుమారమైన లావణ్యము కలిగినటువంటివాడు
రసాజా – రసాయాః పుత్రీ రసాజా – భూమిపుత్రి అయిన సీతాదేవి
ఆప – పొందెను.
నృతాశ్రితం – నరుణ్ణి ఆశ్రయించినటుగా కన్పట్టుచున్న
కావిరామదలాప – కా+అవిరామ+ద+లాప = అవిరామాలాపయా కా దదాతి సా – అవిచ్ఛిన్నమైన సుమధుర సలాపములచేత మనసుకు ఆహ్లాదము కలిగించునటువంటిది
గోసమావామతరా – గోసమా+అవామతరా = భూమితో సమానమైన (వామా న తదవామా, భూరీకృతేతి తరా) అత్యున్నతమైన క్షమా గుణమును కలిగియుండెడిది.
నతా – తనకు వంగి నమస్కరించువారిపట్ల

తాత్పర్యము: తన అవిచ్ఛిన్నమైన సుమధుర సలాపములచేత మనసుకు ఆహ్లాదము కలిగించునటువంటిది, తనకు విధేయత ప్రకటించువారిపట్ల భూమితో సమానమైన అత్యున్నతమైన క్షమా గుణమును కలిగియుండెడిది, భూమిపుత్రి అయిన సీతాదేవి, లక్ష్మిదేవికి భర్త అయినటువంటివాడు శ్రీమహావిష్ణువు అంశకల్గిన వాడిని, నిలువెత్తు సుకుమార లావణ్యమే మూర్తీభవించినట్లున్న వాడిని అయిన శ్రీరామచంద్రుని పొందెను. (అనగా ఉన్నత గుణసమన్విత అయిన సీత స్వయంవరమున మహోత్కృష్ట మానవ వపుషధారియగు శ్రీరామచంద్రుని వరించెను అని కవి అర్థము)

పై శ్లోకమునకు విలోమము (వెనుకకు రాయబడినది)
తేన రాతామవామాస గోపాలాదమరావికా
తం శ్రితం నృపజా సారభం రామా కుసుమం రమా

ప్రతిపదార్థము:
తేన – ఆ నారదునిచేత
రాతం – కొనిరాబడిన
గోపాలాత్ – శ్రీకృష్ణుడి నుండి
అమరావికా – అమరులు అనగా దేవతలను రక్షించునటువంటివాడు
తమ్ శ్రితం- ఆ సకలశ్రేయఃకారకుడు అయిన
నృపజా – రాకుమార్తె అయిన
సారభం – అతి సుందరమైన
అవామ – వంకరలు లేనటువంటిదైన
రామా కుసుమం – ఆహ్లాదము కలిగించు పారిజాత కుసుమమును
రమా – రుక్మిణీ దేవి
అస – పొందెను.


తాత్పర్యము: రాకుమార్తె అయిన రుక్మిణీ దేవి దేవతలను రక్షించునటువంటివాడు సకలశ్రేయఃకారకుడు అయిన శ్రీకృష్ణుడి నుండి నారదునిచేత కొనిరాబడిన సుందరమైన, నిష్కల్మషమైన, మనసుకు ఆహ్లాదము కలిగించు పారిజాత కుసుమమును పొందెను.


శ్లోకము

అనులోమము:
రామనామా సదా ఖేదభావే దయావాన్ అతాపీనతేజాః రిపౌ ఆనతే
కాదిమోదాసహాతా స్వభాసా రసామే సుగః రేణుకాగాత్రజే భూరుమే

ప్రతిపదార్థము:
రామనామా – రాముడు అను నామము గలిగినవాడు
సదా – ఎల్లప్పుడూ
ఖేదభావే – దుఃఖితులపట్ల
దయావాన్ – దయాస్వభావము కలిగినవాడు
అతాపీనతెజాః – అతాపీ+ఇన+తేజాః = ఇనతేజము అనగా సూర్యతేజము కలిగినవాడు అయినను చల్లని వాడు (అతాపీ)
కాదిమోదాసహాతా = కమ్ ఆదంతి ఇతి కాదినః అను వాఖ్యము ప్రకారము, కమ్ అనగా నీరు సేవించువారు, ఆచమనము సేయువారు, గృహస్థులు లేక సాధువులు; మోదా+అసహాతా = మోదమును ఓర్వలేనట్టివారు – సాధువుల, సత్గృహస్థుల సంతోషమును ఓర్వలేనట్టివారు; రాక్షసులను;  హతా – సంహరించువాడు (శ్రీరామచంద్రుడు, సాధు సత్గృహస్థుల సంతోషమును ఓర్వలేనట్టివారైన రాక్షసులను సంహరించువాడు అని కవి భావము)
రేణుకాగాత్రజ – రేణుకాదేవి పుత్రుడైనట్టి పరశురాముడు
స్వభాసా – స్వీయ పరాక్రమముచేత ప్రకాశించునటు వంటివాడు.
సుగః రసామే – సుగః = మంచి నడత గలిగి; రసాం అనగా భూమిని; ఆమే – చుట్టినటువంటివాడు ; తండ్రి పట్ల అగౌరవము చేసినందుకు ఒక సద్వివేచన చేత భూమండలమును ౨౧ మార్లు ప్రదక్షిణ చేసి క్షత్రియనాశనము చేసినవాడు.
భూరుమే – భూరి సంపదలు కలిగినట్టి వాడు
ఆనతే – తనకు లొంగినవాడు అయిన
రిపౌ – శత్రువుయందు
అతాపీ – చల్లనివాడు అయ్యెను.

తాత్పర్యము: రామనామభోదితుడగు శ్రీరామచంద్రుడు, ఎల్లప్పుడూ దుఃఖితులపట్ల దయాస్వభావము కలిగినవాడు, సూర్యసమాన తేజము కలిగినవాడు, సాధు సత్గృహస్థుల సంతోషమును ఓర్వలేనట్టివారైన రాక్షసులను సంహరించువాడు అయినను, స్వీయ పరాక్రమముచేత ప్రకాశించునటు వంటివాడు, భూరి సంపదలు కలిగినట్టి వాడు, తండ్రి పట్ల అగౌరవము చేసినందుకు ఒక సద్వివేచన చేత భూమండలమును ౨౧ మార్లు ప్రదక్షిణ చేసి క్షత్రియనాశనము చేసినవాడు, రేణుకాదేవి పుత్రుడైనట్టి పరశురాముడు తనను శత్రువు భావించిననూ, తన గుణసంపత్తి తెలిసి తనకు లొంగినవాడు అగుటవలన అతని (అనగా పరశురాముని) పట్ల శాంతస్వభావుడు అయ్యెను.

పై శ్లోకమునకు విలోమము (వెనుకకు రాయబడినది)
మేరుభూజేత్రగా కాణురే గోసుమే సా అరసా భాస్వతా హా సదా మోదికా
తేన వా పారిజాతేన పీతా నవా యాదవే అభాతఖేదా సమానామర

ప్రతిపదార్థము:
మేరుభూజేత్రగా = మేరుభూ+జేత్ర+అగా = మేరుపర్వత భూభాగమును సైతము జయించిన పర్వతము నందున్న (శ్రీకృష్ణుని పెంపు చూసుకొని రైవతక పర్వతము మేరు పర్వతమును సైతము సవాలు చేసి గెలిచిందని పురాణకథనము. ఆ రైవతకుడే బలరాముని మామ)
కాణురే - కా+అణు+ర+ఇ = చిన్న సంతోషములను చేకూర్చునట్టిది అనగా అతిగా సంతోషము కలగజేయుట యందు విఫలమైనది.
గోసుమే – మట్టిపూవులు
సా – ఆ రుక్మిణిదేవి
అరసా – అనురక్తి లేనిదై (రసాస్వాదనము చేయతగనివి కాగా)
పారిజాతేన – పారిజాత పుష్పముచేత
భాస్వతా –ప్రకాశముతో కూడినట్టిది
యాదవే – యాదవులందరికినీ
సదామోదితా – అందరినీ ఆకట్టుకొనునది
అఖేదా – దుఃఖమును పరిమార్చునది
పీతా – తెల్లనిది
నవా – క్రొంగొత్తదిగా కనపడునదిగా
అభాత్ – శోభించెను
సమానామరా – అమరులతో సమానమైన తేజస్సు కలిగినది.


తాత్పర్యము: ఆ రుక్మిణీ దేవి మేరుపర్వతస్పర్ధియగు రైవతక పర్వతసానువులయందు శ్రీకృష్ణునితో పరిభ్రమించుచూ, సామాన్యపుష్పములయందు అనురక్తి కోల్పోయి, దైవవృక్షసంజనితమైన ఆ తెల్లని పారిజాతపుష్పశోభ చేత శోభించుచూ, యాదవగణ దుఃఖములను పరిమార్చునది, అందరికీ ఆహ్లాదము కలిగించునది,  దివ్యతేజస్సుతో అలరారునది, అయి క్రొంగొత్తగా అమరసమాన తేజస్సుతో కన్పడెను.




శ్లోకము – ౮

అనులోమము:
సారసాసమధాతాక్షిభూమ్నా ధామాసు సీతయా
సాధు అసౌ ఇహ రేమే క్షేమే అరమాసురసారహా

ప్రతిపదార్థము:
సారసాసమ = సారసా+అసమ = సారసములు అనగా పద్మములకు అసమానములైనటువంటివి. పద్మములను పోలినటువంటివి అయినను ఈ సందర్భములో వాటికి తద్భిన్న శోభ కలిగినట్టివి.
అక్షిభూమ్నా – అటువంటి కన్నులను
ధాత - కన్నులను పొందినటువంటివాడు
ధామాసు – నివాసము చేయునటువంటివాడు
సాధు – సజ్జనులలోకెల్ల వినుతికెక్కినవాడు
అసౌ – అతడు = అనగా ఆ శ్రీరామచంద్రుడు
ఇహ – ఇక్కడ, ఈ అయోధ్యాపురి యందు
సీతయా – సీతతో కూడి
రేమే – రమించువాడును
క్షేమే – సమస్త జనావళికినీ క్షేమము చేకూర్చువాడునూ
అరం – చిరమునకు విరోధము – రాక్షసులను
అసురసారహా – అసుర+సార+హా= రాక్షసులను సంహరించువాడు

తాత్పర్యము: శ్రీరామచంద్రుడు తక్కిన సమయములలో జలజాయతాక్షుడైననూ, అసురసంహారవేళ, రాక్షసులను రాక్షసులను సంహరించువాడునూ అయి పద్మములకు పోలిక లేనట్టి అరుణాయతలోచనుడై, అతిత్వరగా రాక్షస సంహారమును చేయుచూ, సజ్జనులలోకెల్ల వినుతికెక్కినవాడునూ, సీతతో కూడి రమించువాడునూ, సమస్త జనావళికినీ క్షేమము చేకూర్చువాడునూ అయి ఆ అయోధ్యాపురియందుండదొడగెను.

పై శ్లోకమునకు విలోమము (వెనుకకు రాయబడినది)
హారసారసుమా రమ్యక్షేమేరే ఇహ విసాధ్వసా
య అతసీసుమధామ్నా భూక్షితా ధామ ససార సా

ప్రతిపదార్థము:
హారసారసుమా – పుష్పములలోకెల్లా అత్యుత్కృష్టమైనది అయిన పారిజాత పుష్పముతో కూడిన హారమును ధరించినది
రమ్యక్షేమేరే – భద్రమైనది, రమణీయమైనది అగుచూ
విసాధ్వసా – (సాధ్వసా వినా) భయము లేనిదై
య – అగు
అతసీసుమధామ్నా – అతసీపుష్పములచే ఒప్పారుచూ
భూక్షితా – భూమీశుడగు శ్రీకృష్ణుని
ధామ – మందిరమునకు
ససార –చనెను
సా – ఆ రుక్మిణీ దేవి

తాత్పర్యము: భద్రమైనది, రమణీయమైనది, పుష్పములలోకెల్లా అత్యుత్కృష్టమైనది అయిన పారిజాత పుష్పముతో కూడిన హారమును ధరించినది, భయము లేనిది అగు ఆ రుక్మిణీ దేవి భూమీశుడగు శ్రీకృష్ణుని మందిరమునకు అతసీపుష్పములచే ఒప్పారుచూ చనెను.


శ్లోకము – ౯

అనులోమము:
సాగసా భరతాయ ఇభమాభాతా మన్యుమత్తయా
స అత్ర మధ్యమయ తాపే పోతాయ అధిగతా రసా

ప్రతిపదార్థము:
సాగసా=సా+అగసా = కుటిలమైన మనస్తత్వము కలిగినది
భరతాయ = రామానుజుడైన భరతుని కొఱకు
ఇభమాభాతా = ఇభమా+భాతా = గజలక్ష్మీ శోభితమైన (రథ గజ తురంగాది శోభితమైన రాజ్యము)
మన్యుమత్తయా = మన్యు+మత్తయా - మానుషమైన కోరికలచే మనస్సు వికలము పొందినటువంటిది
స అత్ర = అతని వద్ద నుండి
మధ్యమయ = దశరథుని భార్యలలో మధ్యమురాలైన కైకేయి
తాపే = కోపము చేత పరిగ్రహింపబడినదై
పోతాయ = తన కొమరుని కొఱకు
అధిగతా రసా= భూమిని పొందబడినది అయ్యెను.

తాత్పర్యము: కుటిలమైన మనస్తత్వము గలది, మానుషమైన కోరికలచేత మనస్సు వికలము పొందినటువంటిది, దశరథుని భార్యలలో మధ్యమురాలైన కైకేయి, తన కుమారుడైన భరతుని గజలక్ష్మీ శోభితమైన అయోధ్యానగరమునకు రాజును చేయగోరి, కోపావేశపరిగ్రస్తయై దశరథుని వరముల నెపముమీద అయోధ్యాపురిని రాముని నుండి గైకొనెను.

పై శ్లోకమునకు విలోమము (వెనుకకు రాయబడినది)
సారతాగధియా తాపోపేతా యా మధ్యమత్రసా
యాత్తమన్యుమతా భామా భయేతా రభసాగసా

ప్రతిపదార్థము:
సారతాగధియా = అత్యంత తెలివి మంతురాలైన
తాపోపేతా = కోపముచేత రుష్టాననయగు
యా – ఆ
మధ్యమత్రసా = సన్నని నడుము గలది
అత్తమన్యుమతా = మిక్కిలి రోషపరాయణ చిత్తయగు
భయేతా = భీతిల్లినటువంటిది యగు
భామా = ఆ సత్యభామాదేవి
రభసాగసా = తొందరపాటు చర్యగా శ్రీకృష్ణుని తప్పుగా తలచెను


తాత్పర్యము: సన్నని నడుము గల ఆ సత్యభామాదేవి అత్యంత తెలివిమంతురాలు అయిననూ, మిక్కిలి రోషపరాయణ చిత్తయగుచూ, కోపముచేత రుష్టాననయై, భీతిల్లి, తొందరపడి పారిజాతపుష్పము శ్రీకృష్ణుడే రుక్మిణీదేవికి ఇచ్చెనని తలచెను.


శ్లోకము – ౧౦
అనులోమము
తానవాదపకా ఉమాభా రామే కాననదాససా
యా లతా అవృద్ధసేవాకా కైకేయీ మహదాహహ

ప్రతిపదార్థము:
తానవాదపకా = తానవత్+అపకా = తనువును శుష్కింపచేయుటవలన, సుఖములేకపోవుటచేత
ఉమాభా = కాంతిని కోల్పోయినట్టుగా కనపడుచున్న
రామే కాననదా = రామునికి వనములను ఇచ్చినది అనగా శ్రీరామ వనవాసానికి కారణభూతురాలైనటువంటిది
సా = ఆమె
యా = ఎవ్వరైతే
లతా = మొక్కవలె
అవృద్ధసేవాకా = వృద్ధుడు అయిన మహారాజు (దశరథుని) సేవ యందు నిరపేక్ష కలిగినటువంటిది
కైకేయీ = కేకయ దేశపు మహారాజు కూతురైన కైకేయీ దేవి
మహద = పట్టాభిషేకమును నిరాకరించినటువంటిది
అహహ = అయ్యో!
ఆస = ఉండెను
తాత్పర్యము: అయ్యో! విధి విపరీతమువలన శ్రీరామపట్టాభిషేకమును నిరాకరించి వారికి వనవాసప్రాప్తి కలుగజేసినట్టినది, వృద్ధ మహీపాలుడైన దశరథమహారాజు యొక్క సేవలను కూడా విస్మరించినది అయిన కేకయ రాజపుత్రి కైకేయీ దేవి సమస్త సుఖములను త్యజించి, నీరు త్రావక శుష్కించిన తీగవలె కాంతివిహీనమై కన్పడదొడగెను. (తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన శ్రీరామచంద్రుని నిజేచ్ఛ లేక మంధర మాటలు విని అడవులకు పంపిన కైకేయీ దేవి కాంతివిహీనయై దైన్యతనొందెనని భావము).
పై శ్లోకమునకు విలోమము (వెనుకకు రాయబడినది)
హహ దాహమయీ కేకైకావాసేద్దవృతాలయా
సా సదాననకా ఆమేరా భామా కోపాదవానతా
ప్రతిపదార్థము:
హహ = అయ్యో!
దాహమయీ = కోపసంతాపముచే కూడుకొన్నది
కేకైకావాసేద్దవృతాలయా – కేకా+ఏకావాసః+వృతాలయా = నెమళ్ళు తమ ఆవాసముగా చేసుకొన్నటు వంటిది, శోభించుచున్నది అయిన మహాదాంతఃపురమున
సా = ఆ సత్యభామా దేవి
సదాననకా = మిక్కిలి శోభతో కూడినటువంటి చక్కని ముఖ బింబము కలది
ఆమేరా = ఆమ+ఇరా = దుఃఖీభూత పరితప్తయై
కోపాదవానతా = కోప+దవా+ఆనతా = కోపాగ్ని ప్రజ్వలిత ముఖారవిందగా కన్పడెను.
తాత్పర్యము: హా! ద్వారకాపురియందు చక్కని నెమళ్ళగుంపులకు ఆవాసమైన మహాదాంతఃపురమునందున్న, పరాభవ చేతస్కురాలైన ఆ సత్యభామాదేవి మిక్కిలి శోభతో కూడిన ముఖారవిందము, దుఃఖీభూత పరితప్తమై, కోపాగ్ని ప్రజ్వలిత ఛాయను సంతరించుకొనెను.

శ్లోకము -౧౧:

అనులోమము:
వరమానదసత్యాసహ్రీతపిత్రాదరాత్ అహో |
భాస్వరః స్థిరధీరః అపహారోరాః వనగామీ అసౌ ||

ప్రతిపదార్థము:

అహో = అహో (ఆశ్చర్యార్థము)
వరమానదసత్యాసహ్రీతపిత్రాదరాత్ - వర + మానద + సత్యాస + హ్రీత + పిత్రాదరాత్ = పితృవాక్యపరిపాలన కొఱకు ఇవ్వబడిన మాటను నిలబెట్టుకొనుటకై, సత్యమును తప్పుటకు సిగ్గుపడి, మానధనులలో ఉత్తముడు అయిన శ్రీరామచంద్రుడు
భాస్వరః = స్వప్రకాశాముచే భాసించువాడు
స్థిరధీరః = ధీరుడు, స్థిరమైన బుద్ధికలిగినటువంటి వాడు.
అపహారోరాః - అప + హార + ఉరాః = వివిధ హారములను త్యజించినటువంటి వక్షస్థలము కలవాడు.
వనగామీ అసౌ = వనములు పట్ల ప్రయాణము చేయుచున్నవాడు అయ్యెను.

తాత్పర్యము: అహో! వివిధ హారములను త్యజించినటువంటి వక్షస్థలము కలవాడైననూ, స్వప్రకాశాముచే భాసించువాడు, ధీరుడు, స్థిరమైన బుద్ధికలిగినటువంటి వాడు, మానధనులలో ఉత్తముడు అయిన శ్రీరామచంద్రుడు,  పితృవాక్యపరిపాలన కొఱకు ఇవ్వబడిన మాటను నిలబెట్టుకొనుటకై, సత్యమును తప్పుటకు సిగ్గుపడి అరణ్యవాసము పట్ల అభిముఖుడయ్యెను. 

పై శ్లోకమునకు విలోమము (వెనుకకు రాయబడినది)
సౌమ్యగానవరారోహాపరః ధీరః స్థిరస్వభావాః |
హో దారాత్ అత్ర ఆపితహ్రీ సత్యాసదనం ఆర వా ||

ప్రతిపదార్థము:
సౌమ్యగానవరారోహాపరః = తన సౌమ్యగానముచేత శ్రీకృష్ణుడిని ఆకర్షించగలిగినట్టి మృదుమధుర కంఠస్వరము కలిగినది (అయిన సత్యభామా దేవి). 
ధీరః = ధీరుడు
స్థిరస్వభావ = ధృడమైన స్వభావము కలవాడైన శ్రీకృష్ణపరమాత్మ
హో దారాత్ = భయమునొందిన వాడివలె
అత్ర = అక్కడకు
ఆపితహ్రీ = సిగ్గుపడుచున్న వానివలె
సత్యాసదనం = సత్యభామాదేవి యొక్క మందిరమునకు
ఆర = సమీపించినవాడు అయ్యెను.

తాత్పర్యము: ధీరుడు, ధృడస్వభావము కలవాడైన ఆ శ్రీకృష్ణుడు, భయమునొంది, సిగ్గుపడుచున్న వానివలె, తన సౌమ్యగానముచేత శ్రీకృష్ణుడిని ఆకర్షించగలిగినట్టి మృదుమధుర కంఠస్వరము కలిగినదయ్యిన సత్యభామాదేవి యొక్క మందిరమును సమీపించినవాడు అయ్యెను.